అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ ఎస్ ఎస్) గురించి వివరణ తెలుగులో

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి యొక్క కక్ష్యలో ఉన్న ఒక కృత్రిమ ఉపగ్రహం. ఇక్కడ, వ్యోమగాములు నివసిస్తు పని చేస్తారు.

ప్రచురించబడింది: 10 సెప్టెంబర్, 2024 నవీకరించబడింది: 10 సెప్టెంబర్, 2024
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం | International Space Station
భూమి చుట్టూ తిరుగుతున్న మరొక అంతరిక్ష నౌక నుండి తీసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఫోటో. ఈ ఫోటో నాసా వారిది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నిమ్న భూ కక్ష్యలో తెరిగే నివాసయోగ్యమైన కృత్రిమ ఉపగ్రహం. వివిధ అంతరిక్ష యాత్రల కోసం పనిచేసే వ్యోమగాములకు ఈ ఉపగ్రహం ఆతిథ్యమిస్తుంది.

NASA (అమెరికా సంయుక్త రాష్ట్రాలు), రోస్కోస్మోస్ (రష్యా), JAXA (జపాన్), ESA (యూరప్) మరియు CSA (కెనడా)తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థల భాగస్వామ్యంలో ISS నిర్మించబడింది.

ISS భూమి చుట్టూ దాదాపు 250 మైళ్ల (400 కిలోమీటర్లు) ఎత్తులో తిరుగుతుంది. ప్రతి 90 నిమిషాలకు ఒక భ్రమణాన్ని పూర్తిచేస్తుంది.

ఇందులో ఒకేసారి ఆరుగురు వ్యోమగాములు నివసించవచ్చు. ఇక్కడి సిబ్బంది కాలానుగుణంగా మారుతూంటారు. వారు శాస్త్రీయ ప్రయోగాలు మరియు నిర్వహణ పనులను చేస్తూ ISS లో నెలల తరబడి గడుపుతారు. ఎక్కువ కాలం జీవించడానికి అవసరమైన గాలి, నీరు, ఆహార ఉత్పత్తులను అందించే జీవగర్ర (life support) వ్యవస్థలు ఇందులో ఉంటాయి.

అంతరిక్ష కేంద్రం అసలు ఎందుకు?

అంతరిక్ష కేంద్రం చాలా అవసరం. ఎందుకంటే:

  • శాస్త్రీయ పరిశోధనలను నిర్వహించడానికి అంతరిక్షంలో ఇది ఒక ప్రయోగశాల.
  • దీర్ఘకాలిక అంతరిక్షయానం, రోబోటిక్ కార్యకలాపాలు మరియు అంతరిక్ష నడకల (spacewalk) కోసం ఇది ఒక పరీక్షాస్థలం.
  • చంద్ర, అంగారక యాత్రల వంటి భవిష్యత్ గహన అంతరిక్ష (deep space) యాత్రల కోసం శిక్షణా కేంద్రం.

అంతర్జాతీయ ప్రయత్నం

ISS నిర్మాణం దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో జరిగిన ఒక బృహత్తర కార్యక్రమం. అంతరిక్ష సంస్థల మధ్య అంతర్జాతీయ సహకారంతో ఈ ప్రాజెక్ట్ సాధ్యపడింది:

  1. NASA (యునైటెడ్ స్టేట్స్): ~50% నిధులు
  2. రోస్కోస్మోస్ (రష్యా): ~20% నిధులు
  3. JAXA (జపాన్): ~5% నిధులు
  4. ESA (యూరోప్): ~10% నిధులు
  5. CSA (కెనడా): ~5% నిధులు

ఈ ఉపగ్రహం అంతర్జాతీయ సహకారంతో సాధించిన ఒక గొప్ప విజయం. దేశాల నడుమ సహకారంతో సంక్లిష్టమైన శాస్త్ర, సాంకేతిక లక్ష్యాలను సాధించవచ్చని ఈ కార్యక్రమం నిరూపించింది.

ఇటీవలి ప్రణాళికల ప్రకారం, త్వరలో, మన భారతీయ వ్యోమగాముల్లో ఒకరు ISS కి వెళ్లి పని చేయవచ్చు.