రక్త-మెదడు కంచె గురించి వివరణ తెలుగులో

రక్త-మెదడు కంచె అనేది మన రక్తం మరియు మెదడు నడుమ పదార్థాల బదిలీని నియంత్రించి మెదడును రక్షించే ఒక వ్యవస్థ.

21 జనవరి, 2025
రక్త-మెదడు కంచె గురించి వివరణ | Blood Brain Barrier
మెదడు స్కాన్. అన్నా ష్వెట్స్ తీసిన ఫోటో.

రక్త-మెదడు కంచె (బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్) మన శరీరంలో ఉండే ఒక అర్థపారగమ్య (semipermeable) అంచు. ఇది రక్తం, మెదడు నడుమ బదిలీ అయ్యే పదార్థాలను నియంత్రించడం ద్వారా మెదడును రక్షిస్తుంది. మన రక్తప్రవాహంలోని హానికరమైన పదార్థాలు మెదడుకు చేరకుండా ఆపి మెదడును రక్షిస్తూనే, అవసరమైన పోషకాలను మాత్రం మెదడుకు చేరనిస్తుంది.

రక్త-మెదడు కంచె నిర్మాణం

  1. రక్త-మెదడు కంచె మెదడులోని రక్త నాళాల గోడలపై (లోపలి వైపు) పరుచుకుని ఉండే ఎండోథెలియల్ కణాల ద్వారా ఏర్పడుతుంది. ఈ కణాల మధ్య గట్టి అనుసంధానత కారణంగా ఎటువంటి ద్రావితాలు (solute, ద్రవాలలో కరిగే పదార్థాలు) ఈ కంచె దాటలేవు.
  2. మెదడులో ఉండే ఆస్ట్రోసైట్లు (గ్లియల్ కణాలు) నిర్మాణపరమైన ఊతాన్నిస్తాయి.
  3. రక్త-మెదడు కంచె వ్యవస్థలో పోషకాల వంటి కొన్ని ముఖ్యమైన అణువుల బదిలీని సాధ్యం చేయడానికి ప్రత్యేకమైన పారగమ్య మండలాలు (Specialized permeable zones), ఇతర పారగమ్య అంగాలు ఉంటాయి.

రక్త మెదడు కంచె యొక్క విధులు

రక్త మెదడు కంచె మెదడును విషపదార్థాలు, వ్యాధికారక క్రిములు, రక్తంలోని కొన్ని రసాయనాల హెచ్చుతగ్గుల నుండి రక్షిస్తుంది.

ఏవేవి రక్త మెదడు కంచెను దాటగలవు?

  1. ప్రాణవాయువు (oxygen), బొగ్గుపులుసు (carbon dioxide) వంటి వాయువులు
  2. కొవ్వులో కరిగే పదార్థాలు (lipid soluble)
  3. నిర్దిష్ట వాహకాల ద్వారా చిన్న అణువులు మరియు అయాన్లు (ఉదా., గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు) దాటగలవు.

ఏ అణువులు రక్త-మెదడు అవరోధాన్ని దాటలేవు?

  1. పెద్ద అణువులు (ఉదా., ప్రోటీన్లు).
  2. చాలా వరకు మందులు/రసాయనాలు (అయితే రక్త మెదడు కంచె దాటడానికి ప్రత్యేకంగా కొన్ని మందుల్ని రూపొందిస్తుంటారు, అవి మాత్రం దాటగలవు).

హోమియోస్టాసిస్

నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, మెదడులో సిగ్నలింగ్ సరిగ్గా జరగడానికి ఐయాన్ల కూర్పు అనుకూలమైన స్థాయిలలో ఉండటం చాలా ముఖ్యం. అందుకు తగిన విధంగా ఎక్కువ హెచ్చుతగ్గులు లేకుండా మెదడులో స్థిరమైన సురక్షితమైన వాతావరణాన్ని నిర్వహించడాన్ని హోమియోస్టాసిస్ అంటారు. రక్త మెదడు కంచె ప్రధాన విధులలో ఇదీ ఒకటి.

రక్త మెదడు కంచె గురించి పరిశోధనలు ఎందుకు జరగాలి?

రక్త మెదడు కంచె గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఇది అనేక ఔషధాల పనితీరుకు ముఖ్యం కాబట్టి. చికిత్స ఔషధాలు మెదడుకు చేరాలంటే, ఔషధ అణువులు రక్త మెదడు కంచెను దాటుకుని వెళ్ళాలి. ఆయితే, పైన చెప్పినట్టు రక్త మెదడు కంచె అన్నింటిని దాటనివ్వదు కాబట్టి మెదడు సంబధిత రోగాలకు చికిత్స చేయటం అంత సులువు కాదు.

వాపు లేదా గాయం వంటి కొన్ని పరిస్థితులలో కంచె దెబ్బతినవచ్చు. ఇది నాడివాపుకు (neuroinflammation) దారితీయవచ్చ, లేదా ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశాన్నిపెంచవచ్చు. అల్జీమర్స్ (Alzheimer’s), మల్టిపుల్ స్క్లెరోసిస్ (Multiple sclerosis, నాడీ కణాల పైపొర దెబ్బతినటం), మెదడుగాతం (brain stroke) వంటి రుగ్మతలు ఉన్నవారిలో కూడా రక్త మెదడు కంచె పనితీరు చెడిపోతుంది. దీనివల్ల కంచె పారగమ్యత అనుకూలమైన స్థాయిని మించి పెరిగే అవకాశం ఉంది. ఇది మెదడుకు మంచిది కాదు కాబట్టి ఇలాంటి రోగాలపై అవగాహన పెంచుకోవడం కోసం పరిశోధనలు చెయ్యాలి.

రక్త మెదడు కంచెపై తాజా పరిశోధనలను అవలోకనం కోసం ఈ పత్రాన్ని (ఇంగ్లీషులో) చదవమని ప్రోత్సహిస్తున్నాను.

టూకీగా, రక్త-మెదడు కంచె హానికరమైన పదార్థాలను అడ్డుకుంటూనే, అవసరమైన పదార్థాలను ఎంపిక చేసుకొని వెళ్ళడానికి అనుమతించడం ద్వారా మెదడును కాపాడుతుంది. మెదడు హోమియోస్టాసిస్‌ను నిర్వహిస్తుంది. కానీ, నాడీ సంబంధిత రోగాలకు చికిత్స చేయడానికి ఔషధాల పంపిణీని కష్టతరం చేస్తుంది.

సంబంధిత పదాలు

Chloroplast

క్లోరోప్లాస్ట్

క్లోరోప్లాస్ట్‌లు కిరణజన్య సంయోగక్రియకు కారణమయ్యే మొక్కల కణాలలో కనిపించే అవయవాలు.
Fungi

శిలీంధ్రాలు

శిలీంధ్రాలు యూకారియోటిక్ జీవుల సమూహం, వీటిలో ఈస్ట్‌లు మరియు అచ్చులు, అలాగే పుట్టగొడుగుల వంటి స్థూల శిలీంధ్రాలు ఉంటాయి.
Lysosome

లైసోజోమ్

లైసోజోములు ఒక కణంలోని సెల్యులార్ వ్యర్థాలు మరియు విదేశీ పదార్థాల క్షీణత, రీసైక్లింగ్‌కు బాధ్యత వహించే పొర-బంధిత అవయవాలు.
Supercoiling

సూపర్ కాయిలింగ్

సూపర్‌కాయిలింగ్ అనేది DNA తంతువులను మరింత కాంపాక్ట్ స్ట్రక్చర్‌గా అతిగా లేదా అండర్‌వైండింగ్ చేయడాన్ని సూచిస్తుంది.
Macronutrients

స్థూల పోషకాలు

మాక్రోన్యూట్రియెంట్లు పెరుగుదల, శక్తి ఉత్పత్తి మరియు మొత్తం శారీరక విధుల కోసం జీవులకు పెద్ద పరిమాణంలో అవసరమైన పోషకాలు.
Centrosome

సెంట్రోసోమ్

సెంట్రోసోమ్ జంతు కణాలలో ఒక చిన్న, ప్రత్యేకమైన అవయవం, ఇది కణ విభజనలో, మైక్రోటూబ్యూల్స్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది.
Chemotherapy

కీమోథెరపీ

కెమోథెరపీ అనేది క్యాన్సర్ కణాల పెరుగుదలను చంపడానికి లేదా మందగించడానికి మందులను ఉపయోగించే వైద్య చికిత్స.
Genome

జీనోమ్

జీనోమ్ అనేది ఒక జీవిలో DNA రూపంలో ఉండే పూర్తి జన్యు సూచనల సమితి, అన్ని జన్యువులు కూడిక.
Angiosperm

ఆంజియోస్పెర్మ్

యాంజియోస్పెర్మ్స్ అండాశయంలోని విత్తనాలను ఉత్పత్తి చేసే పుష్పించే మొక్కలు.
Diploid

డిప్లాయిడ్

డిప్లాయిడ్ అనేది రెండు పూర్తి క్రోమోజోమ్‌లను కలిగి ఉన్న జీవి లేదా కణాన్ని సూచిస్తుంది, సాధారణంగా 2n గా సూచిస్తారు.