స్మార్ట్ వాచ్‌లు మానసిక కుంగుబాటును గుర్తించగలవా?
స్మార్ట్ వాచ్‌లు సేకరించిన డేటా ఆధారంగా మానసిక కుంగుబాటు (డిప్రెషన్) లక్షణాలను అంచనా వేయడానికి ఒక డిజిటల్ బయోమార్కర్‌ను అభివృద్ధి చేశారు.

మన భావోద్వేగాల మీద, మనం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మీద, మన మానసిక స్థితి ప్రభావం చూపుతుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్యానికి నిద్ర, ఇంకా సిర్కాడియన్ లయ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
సాంప్రదాయ పద్ధతులైన రక్త పరీక్షలు, పాలీ-సోమ్నోగ్రఫీ వంటివి సిర్కాడియన్ లయను, నిద్రను అంచనా వేయడానికి ఉపయోగపడగలవు. కానీ వీటి కోసం శరీరంలోకి చొచ్చుకువెళ్ళాలి (invasive) (మచ్చు: రక్త పరీక్షకు సూది గుచ్చాల్సి ఉంటుంది). అలాగే ఖర్చుతో కూడుకున్నవి కావడం, ఆసుపత్రిలో చేరాల్సి రావడం వల్ల చాలా మందికి ఈ పరీక్షలు అందుబాటులో ఉండవు.
స్మార్ట్‌వాచ్ వంటి ధరించగలిగే పరికరాలు శరీరంలోకి చొచ్చుకుపోయే అవసరంలేకుండా, ఈ సమస్యకు ఒక సులభమైన పరిష్కారాన్ని అందిస్తాయి. వీటీతో గుండెచప్పుడు రేటు, కార్యాచరణ (activity) స్థాయి వంటి బయోమెట్రిక్ డేటాను నిజ సమయంలో సేకరించవచ్చు.
కొరియా, అమెరికా దేశాలకు చెందిన ఒక సంయుక్త పరిశోధనా బృందం, ఈ ధరించగలిగే పరికరాల ద్వారా సేకరించిన బయోమెట్రిక్ డేటాను వాడి మరుసటి రోజు మానసిక స్థితిని అంచనా వేయడానికి, అలాగే కుంగుబాటు లక్షణాలు వచ్చే అవకాశాన్ని ముందుగానే గుర్తించడానికి ఒక సాంకేతికతను రూపొందించింది.
ఈ బృందం ఒక ప్రత్యేక ఫిల్టరింగ్ (వడపోత) సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇది స్మార్ట్‌వాచ్ నుండి సేకరించిన టైంసిరీస్ సమాచారం ఆధారంగా, మనలోని రోజువారీ సిర్కాడియన్ గడియారం దశను సరిగ్గా గుర్తిస్తుంది. అలాగే, ఈ సాంకేతికత మెదడులోని సిర్కాడియన్ లయను ఖచ్చితంగా ప్రతిబింబించే ఒక డిజిటల్ కవలను సృష్టిస్తుంది. ఈ డిజిటల్ కవలను పరిశీలించి మన సిర్కాడియన్ లయలో అంతరాయాలను ముందుగానే గుర్తించవచ్చు.
ఈ సాంకేతికత యొక్క పనితీరును అర్థంచేసుకోడానికి సుమారు 800 మంది షిఫ్ట్ కార్మికులపై పరిశోధనా బృందం ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ సాంకేతికతతో సిర్కాడియన్ లయలో అంతరాయాలను గుర్తించడం ద్వారా, మరుసటి రోజు మానసిక స్థితిని, అలాగే నిద్ర సమస్యలు, ఆకలిలో మార్పులు, ఏకాగ్రత తగ్గడం, ఆత్మహత్య ఆలోచనలు వంటి ఆరు ప్రధాన కుంగుబాటు లక్షణాలను అంచనా వేయవచ్చని ఈ అధ్యయనం చూపించింది.
కాబట్టి, స్మార్ట్‌వాచ్‌లను ఉపయోగించి మానసిక కుంగుబాటును గుర్తించడం సాధ్యపడవచ్చు. అయితే, ఈ సాంకేతికతను మరింత ఖచ్చితమైనదిగా, నమ్మదగినదిగా మార్చడానికి ఇంకా విస్తృతమైన పరిశోధనలు చేయవలసి ఉంది.
కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అందించిన సమాచారం ఆధారంగా ఈ వ్యాసం వ్రాయబడింది. మీరు ఈ వార్తా కథనానికి సంబంధించిన పరిశోధనా పత్రాన్ని డిజిటల్ మెడిసిన్ పత్రిక లో చదవవచ్చు.
సంబంధిత సైన్స్ వార్తలు

పరమాణు శిలాజాల నుండి అంతర్దృష్టులు

జెనెటిక్స్ మరియు జియాలజీ ఒక బిలియన్ సంవత్సరాల క్రితం జీవితం ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది.

వృద్ధాప్యం యొక్క అణు ఆధారం ఏంటి?

డీ ఎన్ ఏ మరియు వృద్ధాప్యం మధ్య సంబంధాన్ని ఒక కొత్త పరిశోధన అధ్యయనం కనుగొంది.

డయాబెటిస్ మెల్లిటస్ పరమాణుపరంగా ఎలా ప్రారంభమవుతుంది?

పరిశోధకులు జన్యు విశ్లేషణ నిర్వహించడం ద్వారా టైప్ 2 మధుమేహం యొక్క ప్రారంభ దశలను అర్థం చేసుకోవడంలో పురోగతి సాధించారు.

మొక్కలు అనుకున్నదానికంటే ఎక్కువ CO2ని గ్రహించగలవు

మొక్కలు గతంలో నమ్మిన దానికంటే ఎక్కువ CO2ని గ్రహించవచ్చని కొత్త పరిశోధన చూపిస్తుంది.