వేడిగా లేక చల్లగా? మెదడు ఉష్ణ అనుభూతులను ఎలా గ్రహిస్తుంది?

మెదడు ఉష్ణోగ్రతను ఎలా అర్థం చేసుకుంటుందో తెలుసుకోవడానికి పరిశోధకులు మెదడు పటాలను ఉపయోగించారు.

21 జనవరి, 2025
వేడిగా లేక చల్లగా? మెదడు ఉష్ణ అనుభూతులను ఎలా గ్రహిస్తుంది?
ఒక స్త్రీ తన చేతులను వేడి చేసుకుంటోంది. థామస్ విటాలీ తీసిన ఫోటో. వేడిగా లేక చల్లగా? మెదడు ఉష్ణ అనుభూతులను ఎలా గ్రహిస్తుంది?.

మెదడు యొక్క బయటి పొర అయిన కార్టెక్స్, ఉష్ణ అనుభూతులకు కారణమని మునుపటి అధ్యయనాలు చెపుతున్నాయి. అయితే, ఏదైనా వస్తువు వేడిగా ఉందా లేక చల్లగా ఉందా అనేది కార్టెక్స్ ఎలా నిర్ణయిస్తుందో మనకు ఇంకా తెలియదు. ఉష్ణ సున్నితత్వం చాలా వరకు వ్యక్తిగతమైన విషయం. ఒకరికి సౌకర్యవంతంగా అనిపించే ఉష్ణోగ్రత మరొకరికి వేడిగా లేక చల్లగా అనిపించొచ్చు.

మెదడు ఉష్ణోగ్రతను ఎలా ప్రాసెస్ చేస్తుందనేది అర్థంచేసుకోవడం వల్ల మన రోజువారీ జీవితాలను మెరుగుపర్చుకోవొచ్చు. “సౌకర్యాన్ని, ఎనర్జీ ఎఫీషియన్సీని సమన్వయం చేస్తూ నడిచే ఏసీ లాంటి ఆటోమేటిక్ ఉష్ణ నియంత్రణ వ్యవస్థలను మెరుగుపర్చొచ్చు. అలాగే మనం వేసుకునే బట్టలు ఎంత సౌకర్యంగా వున్నాయో అంచనా వేయడానికి మరింత ఖచ్చితమైన పద్ధతులు కనుక్కోవచ్చు” అని జపాన్‌లోని టోక్యోలోని వాసెడా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హిరోనోరి వటనాబే చెప్పారు.

పరిశోధన ఎలా జరిగింది?

జపాన్‌లోని వాసెడా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక కొత్త అధ్యయనంలో వేడి మరియు చల్లని ఉష్ణోగ్రతలకు మెదడు ప్రతిస్పందనను మ్యాప్ చేయడానికి ఎలక్ట్రో-ఎన్సెఫలో-గ్రఫీ (EEG)ని ఉపయోగించారు.

ఈ అధ్యయనంలో పాల్గొన్న 20 మందికి వారి కుడి చేతి చూపుడు, నడిపి వేళ్ల గుండా వేడి లేదా చల్లని ఉష్ణోగ్రతలు అనుభూతి చెందేలా చేశారు. పాల్గొన్నవారు ఒక పెల్టియర్ పరికరం ద్వారా ఈ ఉష్ణోగ్రతలను పల్స్ రూపంలో అనుభూతి చెందారు. వెచ్చని అనుభూతికి 15 క్షణాలపాటు 40 డిగ్రీలు (సెల్సియస్) తర్వాత ఒక 10 క్షణాలపాటు 32 డిగ్రీలు, తర్వాత తిరిగి 40 డిగ్రీలు, ఇలా 32-40 డిగ్రీల నడుమ మారుతున్న “వేడి” పల్స్‌ను అందించారు (చిత్రం చూడండి). అదే తీరులో చల్లని అనుభూతికి 24 - 40 డిగ్రీల నడుమ మారుతున్న “చలి” పల్స్‌ను ఇచ్చారు. ఆ రెండు వేర్వేరు పల్సులకు ప్రతిస్పందనగా మెదడు చైతన్యతను (activity) EEG పరికరాన్ని ఉపయోగించి నమోదు చేసారు. మెదడు చైతన్యత యొక్క సమయ నిర్దిష్టతను, ప్రాంత నిర్దిష్టతను తెలుసుకోడానికి రికార్డింగ్‌లను విశ్లేషించారు.

ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ (EEG) యంత్రం
మెదడు చైతన్యతను రికార్డ్ చేయడానికి పరిశోధకులు ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ (EEG) యంత్రాన్ని ఉపయోగించారు. ఈ చిత్రం ప్రాతినిధ్యం కోసం మాత్రమే.
ఉష్ణ ఎసరేచువులు
పాల్గొన్నవారు వేడి (పైన), చలి (కింద) అనుభూతిచెందేలా చెయ్యడానికి, ఇలా హెచ్చుతగ్గులున్న ఆవర్తన ఉష్ణ ఎసరేచువులను (periodic temperature stimuli) ఇచ్చారు.

పరిశోధన ఫలితాలు ఏమిటి?

EEG రికార్డింగ్లను విశ్లేషించడానికి ఇండిపెండెంట్ కంపోనెంట్ అనాలసిస్, డైపోల్ అనాలసిస్ వంటి విశ్లేషణా పద్ధతులను ఉపయోగించారు. ముఖ్యంగా కొలిచిన మెదడు చైతన్యతలో ఏ తరచుదనాలు (frequencies) ప్రముఖంగా ఉన్నాయి, ఏ తరచుదనంలో ఎంత శక్తి ఉంది, ఆ శక్తి కాలంతో ఎలా మారింది అనే విషయాలు పరిశీలించారు. ఆసక్తికరంగా, వేడి మరియు చల్లని ఉష్ణోగ్రతలు రెండూ మెదడులోని ఒకే ప్రాంతాలను ప్రేరేపించాయి. అయితే, ఈ ప్రాంతాల్లోని చైతన్యత మాదిరులు (patterns), కాలంతో తరచుదనాల శక్తి మారిన తీరు, రెండు రకాల ఉష్ణ అనుభూతులకు వేరువేరుగా ఉన్నాయి. ఈ భిన్న చైతన్యత మాదిరులు, వేడి మరియు చల్లని ఉష్ణోగ్రతల మధ్య తేడాను గుర్తించే యంత్రాంగంలో ఒక అంతర్లీన భాగం అయివుండొచ్చు. ఈ యంత్రాంగంలో ఎడమ అర్ధగోళం (hemisphere) కంటే కుడి అర్ధగోళానికి ఎక్కువ పాత్ర ఉందని ఈ పరిశోధన, అలాగే మునుపటి పరిశోధనలు సూచిస్తునాయి.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ అధ్యయనంలో పొందిన అవగాహన, ఉష్ణ సౌకర్యాన్ని అంచనా వేయడానికి కావాల్సిన మరింత నిష్పాక్షిక పద్ధతులను అభివృద్ధి చేయడానికి అన్వయించవచ్చు.

సారాంశం

సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ అధ్యయనంలో వేడి మరియు చల్లని ఉష్ణోగ్రతల మధ్య తేడాను మన మెదడు ఎలా గుర్తిస్తుందో పరిశోధించారు. EEGని ఉపయోగించి వేడి, చలి, ఈ రెండు రకాల ఎసరేచువులకు (stimuli) మెదడులో ఒకే ప్రాంతాలు స్పందిస్తున్నట్టు కనుగొన్నారు. అయితే ఈ రెండు అనుభూతులకు మెదడులోని ప్రాంతాలు వేర్వేరు తీరుల్లో ఉత్తేజితం అయ్యాయి. ముఖ్యంగా కుడి అర్ధగోళం (hemisphere) లోని ప్రాంతాలు ఉష్ణ అనుభూతులను ప్రాసెస్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుండొచ్చని ఈ పరిశోధన సూచిస్తుంది. ఈ పరిశోధన ఫలితాలు ఉష్ణ సౌకర్యాన్ని అంచనా వేయడానికి, ఉష్ణ నియంత్రణ వ్యవస్థలను మెరుగుపరచడానికి మరింత నిష్పాక్షిక పద్ధతులకు దారితీయవచ్చు.

Waseda University అందించిన సమాచారం ఆధారంగా ఈ వ్యాసం వ్రాయబడింది. మీరు ఈ వార్తా కథనానికి సంబంధించిన పరిశోధనా పత్రాన్ని Neuroscience పత్రిక లో చదవవచ్చు.

సంబంధిత సైన్స్ వార్తలు

కుడి ఎడమైతే పొరపాటు అగునోయ్: డానియోనెల్లా సెరెబ్రమ్ చేపల్లో నావిగేషన్ వ్యూహాలు
న్యూరోసైన్స్ | 26 మే, 2024

కుడి ఎడమైతే పొరపాటు అగునోయ్: డానియోనెల్లా సెరెబ్రమ్ చేపల్లో నావిగేషన్ వ్యూహాలు

అభిలాష్ చీకోటి, న్యూరోసైన్స్ డాక్టరల్ విద్యార్థి

మనం మ్యాప్స్ ఉపయోగించి అనుకున్న చోటుకు చేరుకుంటాము. మరి జంతువుల సంగతేంటి? వాటి స్థానం వాటికి ఎలా తెలుస్తుంది? అవి ఎలా నావిగేట్ చేస్తాయి?

దాని పొడవాటి తోకతో ఒక గ్రే లంగూర్ కోతి.
జీవశాస్త్రం | 02 మార్చి, 2024

మన తోకలు ఎక్కడ? జన్యుశాస్త్రంలో సమాధానం ఉంది!

సంపత్ అమితాష్ గాధి, పీహెచ్‌.డీ

మానవులకు కోతులు, ఇతర జీవులు వంటి తోకలు ఎందుకు ఉండవో ఒకే ఒక జన్యువు మాత్రమే పాక్షికంగా బాధ్యత వహిస్తుంది.

ఇంజెక్షన్.
జీవశాస్త్రం | 27 నవంబర్, 2023

డయాబెటిస్ మెల్లిటస్ పరమాణుపరంగా ఎలా ప్రారంభమవుతుంది?

సంపత్ అమితాష్ గాధి, పీహెచ్‌.డీ

పరిశోధకులు జన్యు విశ్లేషణ నిర్వహించడం ద్వారా టైప్ 2 మధుమేహం యొక్క ప్రారంభ దశలను అర్థం చేసుకోవడంలో పురోగతి సాధించారు.

జీవశాస్త్రం | 09 డిసెంబర్, 2023

శాస్త్రవేత్తలు కొత్త డయాబెటిస్ ట్రిగ్గర్‌ను కనుగొన్నారు

సంపత్ అమితాష్ గాధి, పీహెచ్‌.డీ

ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధించే ఎంజైమ్‌ను పరిశోధకులు గుర్తించారు, ఇది మధుమేహానికి కొత్త చికిత్సలకు దారి తీస్తుంది.